గ్యాస్ కష్టాలు..  కంటిన్యూ..మూగబోయిన బుకింగ్ నంబర్లు

గ్యాస్ కష్టాలు..  కంటిన్యూ..మూగబోయిన బుకింగ్ నంబర్లు
  • ఆన్​లైన్​లో బుక్ ​కాక సిలిండర్లతో ఏజెన్సీలకు..  
  • ఎక్కడ చూసినా భారీ క్యూలైన్లే 
  • ఆఫ్​లైన్​ బుకింగ్​ లేదంటున్న ఏజెన్సీలు 
  • గ్యాస్​ అవసరం లేకపోయినా   బుక్​ చేస్తున్నారంటున్న డీలర్లు  
  • కొనసాగుతున్న ‘కమర్షియల్’ కష్టాలు

హైదరాబాద్​సిటీ,వెలుగు : గ్రేటర్​ పరిధిలో గ్యాస్ వినియోగదారుల కష్టాలు పెరుగుతున్నాయి.  గ్యాస్​దొరకదేమోనన్న భయంతో చాలామంది అవసరం లేకపోయినా సిలిండర్ల కోసం ఎగబడుతున్నారు. ఒక్కసారిగా అందరూ ఆన్​లైన్​లో బుకింగ్​లపై పడడంతో సర్వర్లు క్రాష్​అయి ఫెయిల్​అని వస్తోంది. వాట్సాప్ బుకింగ్​చేస్తే రిప్లై రావడం లేదు.

ఐవీఆర్ఎస్​ద్వారా బుక్​చేద్దామంటే ఆప్షన్స్​అనేవే వినిపించడం లేదు. బుకింగ్​కావడం లేదని, బుక్​చేసి వారం దాటుతున్నా గ్యాస్​రాలేదని ఎంక్వైరీ చేయడానికి నాన్​స్టాప్​గా కాల్స్​చేస్తుండడంతో ఏజెన్సీల్లో సిబ్బంది సమాధానాలు చెప్పలేక ఫోన్లు స్విచ్ఛాఫ్​చేస్తున్నారు. దీంతో వినియోగదారులు సిలిండర్లు పట్టుకుని సరాసరి ఏజెన్సీలకే పోతున్నారు.దీనివల్ల గ్యాస్​కేంద్రాల దగ్గర భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. బుకింగ్​ఉంటేనే సిలిండర్​ఇస్తామని, ఆఫ్​లైన్​బుకింగ్​చేయడం లేదని నిర్వాహకులు వారిని తిప్పి పంపుతున్నారు.  

కమర్షియల్​ సిలిండర్ల నిలిపివేతతో..

నగరంలో భారత్, ఇండేన్, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ గ్యాస్ ఏజెన్సీల ద్వారా సరఫరా జరుగుతోంది. మొత్తం గ్రేటర్​లో 200 మంది డీలర్లు  ఉండగా, 30 లక్షల డొమెస్టిక్​కనెక్షన్లు ఉండగా, కమర్షియల్​సిలిండర్ల సంఖ్య 50 వేల వరకు ఉంటుంది. గృహావసరాలకు ప్రాధాన్యత ఇస్తుండడంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, హాస్టల్స్​, రెస్టారెంట్ల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు.  

డొమెస్టిక్ సిలిండర్లను బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొంటున్నారు. దీనివల్ల కూడా డొమెస్టిక్​సిలిండర్ల కోసం భారీ డిమాండ్​ఏర్పడింది. ఇది గుర్తించిన సివిల్​సప్లయీస్​అధికారులు హోటల్స్, రెస్టారెంట్లపై దాడులు చేసి డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. మూడు రోజుల్లో తనిఖీలు చేసి  381 డొమెస్టిక్​సిలిండర్లు పట్టుకున్నామని, 233మందిపై నమోదు చేసినట్టు చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ రాజిరెడ్డి తెలిపారు. 

700 బుకింగ్స్​ ఉండే..2700 అయ్యింది

చాలామంది గ్యాస్​దొరుకుతుందో లేదోనని, ఆల్​రెడీ ఇంట్లో ఒక సిలిండర్​ఉన్నా ఎక్స్​ట్రా ఉండాలని బుక్​చేస్తున్నారని భారత్​గ్యాస్​ ఏజెన్సీ నిర్వాహకులు, గ్రేటర్ హైదరాబాద్​గ్యాస్​డీలర్స్​అసోసియేషన్​ప్రెసిడెంట్​డి. అశోక్​ కుమార్​ తెలిపారు. గతంలో ఒక్కో ఏజెన్సీకి రోజుకు 7 వందల డొమెస్టిక్ గ్యాస్ బుకింగ్స్ అయితే ఇప్పుడు 2700 అవుతున్నాయని చెప్పారు. బుకింగ్స్ వెల్లువలా వస్తుండడంతోనే ఆన్ లైన్​బుకింగ్ సిస్టమ్ స్లో అయ్యిందంటున్నారు.

 బుక్​ చేసుకున్నా డెలివరీ కాకపోతే ఇలా చేయండి..

వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకున్నా డెలివరీ కాకపోతే తమకు  ఫిర్యాదు చేయాలని ఆయిల్ కంపెనీలు సూచిస్తున్నాయి. ఇంతకుముందు బుక్​చేసిన తర్వాత మూడు రోజుల్లో డెలివరీ చేయాలనే నిబంధన ఉండేదని, ప్రస్తుత పరిస్థితుల్లో 5 రోజుల వరకూ చూడాలంటున్నారు. అయినా సిలిండర్ రాకపోతే ఫిర్యాదు చేయాలంటున్నారు.

ఇండేన్ వినియోగదారులైతే1800-2333-555, 7718955555 నెంబర్లకు, భారత్ గ్యాస్ కస్టమర్లు 1800-22-4344 , 7715012345 కు, హెచ్​పీ గ్యాస్ వినియోగదారులు 1800-2333-555 ,  9493602222కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చంటున్నారు. 


జిల్లాలో గ్యాస్​ కొరత లేదు వికారాబాద్​ కలెక్టర్​ దీపక్ తివారి

వికారాబాద్​, వెలుగు : జిల్లాలో గ్యాస్ కొరత ఉందన్న వార్తల్లో వాస్తవం లేదని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారం గ్యాస్​ విషయమై కలెక్టరేట్​లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎల్పీజీ డీలర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్​మాట్లాడుతూ జిల్లాలో సరిపడా గ్యాస్ నిల్వలున్నాయన్నారు. ఎవరైనా గ్యాస్ బ్లాక్ మార్కెట్ చేసినట్లు దృష్టికి వస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఎస్పీ స్నేహ మెహ్రా, అడిషనల్​కలెక్టర్ రాజేశ్వరి, ఆర్డీవో వాసుచంద్ర, డీసీఎస్​వో సుదర్శనం, డీఎంసీఎస్ మురళి కృష్ణ పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టర్​వికారాబాద్​లోని హెచ్​పీ గ్యాస్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి గ్యాస్​సరఫరా తీరును తెలుసుకున్నారు. 

గ్యాస్​ ఏజెన్సీల ఎదుట లొల్లిలొల్లి

 జీడిమెట్ల/ఇబ్రహీంపట్నం, వెలుగు: కుత్బుల్లాపూర్ పరిధి షాపూర్​నగర్​లోని శాంభవి ఇండేన్​గ్యాస్ ఏజెన్సీ ఎదుట వినియోగదారులు శుక్రవారం ఆందోళనకు దిగారు. డబ్బులు కట్​అవుతున్నాయి గానీ, గ్యాస్​బుక్​కావడం లేదని, మళ్లీ చేస్తే 27రోజులు ఆగమంటోందని వాపోయారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, వినియోగదారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వినియోగదారుల తాకిడి పెరగడంతో నిర్వాహకులు షట్టర్లు మూసేసి వెళ్లిపోయారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని భవాని భారత్ గ్యాస్ ఏజెన్సీ ఎదుట, బాగ్ లింగంపల్లి ఇండేన్​గ్యాస్ ఏజెన్సీ ఎదుట కూడా భారీ సంఖ్యలో వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో క్యూ కట్టారు. ఆన్​లైన్​బుకింగ్​కావడం లేదని డైరెక్ట్ గా సిలిండర్ ఇవ్వాలని నిర్వాహకులను నిలదీశారు. మరికొందరు పేమెంట్ చేసినా డెలివరీ కావడం లేదన్నారు. తమ పేరు మీద బుక్ అయిన సిలిండర్లను బ్లాక్ లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. సిలిండర్ డెలివరీ కాకపోయినా అయ్యిందంటూ పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.